Showing posts with label తెలుసుకుందాం... Show all posts
Showing posts with label తెలుసుకుందాం... Show all posts

Tuesday, 4 November 2014

జీలకర్ర ఉపయోగాలు..

మన వంటకాలలో జీలకర్ర ప్రాధాన్యం ఎనలేనిది. దీనివల్ల ఆహార పదార్ధాలకు రుచి వస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి.

జీలకర్ర ఔషధ గుణాలు :

* జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.
* కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను  నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.
* జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో ఉంచుతుంది.
* గుండె నొప్పులు రాకుండా కాపాడుతుంది. డయేరియాతో బాధపడేవారు ఒక టీ స్పూన్ జీలకర్ర నీటిలో తీసుకుని ఒక టీస్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవాలి.
* నల్ల జీలకర్ర మూలశంకకు మంచి మందు.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్లజీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది.
* గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా జీలకర్ర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
* నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా కాయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి.
* వేడిచేసే గుండం దీనికి ఉంది. అతిగా సేవించకూడదు.
* కనీసం వారానికి ఒకసారి జీలకర్ర రసాన్ని ఒక ఔన్స్  సేవిస్తే గుణం కనిపిస్తుంది.
* కఫ సమస్యలతో బాధపడేవారు జీలకర్ర కషాయం సేవిస్తే గుణం కనిపిస్తుంది.
* వాంతులతో బాధపడేవారు జీలకర్ర నమిలి రసాన్ని మింగితే వాంతులను  నివారిస్తుంది.

Sunday, 26 October 2014

వాత రోగ లక్షణాలు

* శరీరంలో ప్రకోపించిన వాయువు, సకల శరీరానికి మూల కేంద్రమైన శిరస్సులోని నరములలోకి చేరి, దాని తీవ్రత స్థాయిని బట్టి, పూర్తి శరీరాన్ని గానీ, శరీరంలో అర్ధ భాగాన్ని గానీ లేక ఏదో ఒక అవయవాన్ని చచ్చు పడేటట్లు చేస్తుంది.
* శరీరంలోని కీళ్ళు కణుపులు బిగిసిపోతయ్.
* అన్ని జాయింట్లలోను తీవ్రమైన నొప్పులు కలుగుతయ్.
* చేతులు, కాళ్ళు, వీపు, నడుము, మెడ బిగుసుకుపోతుంది.
* ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవటం, శరీరం రూక్షగా ఉండటం జరుగుతుంది. పురుషులలో వీర్యశక్తి నశిస్తుంది.
* స్త్రీలలో ఋతువు అస్తవ్యస్తమౌతుంది, గర్భస్రావాలు జరుగుతయ్.
* శరీరమంతా క్రమంగా వణుకు మొదలవుతుంది. ఏ పని మీద శ్రద్ధ వుండక పాలు మాలికతనం పెరుగుతుంది.
* మర్మావయవాల వద్ద చర్మము పగిలి మంటలు మొదలవుతాయి.

ఇలా వాత రోగాల లక్షణాలు లెక్కకు మించి ఉంటాయి.

Saturday, 25 October 2014

వాత రోగాలు ఎందుకు కలుగుతయ్??

మనలో చాలామంది ఒకేరకమైన రుచులను అధికంగా తినటానికి బాగా అలవాటు పడ్డారు. కొందరు ఆవకాయ  పచ్చడి విపరీతంగా తింటే, మరి కొందరు మాంసము మూడుపూటలా తింటారు.ఇంకొందరు ఎక్కువగా చేదుగా వుండే పదార్ధాలను అమితంగా భుజిస్తారు. ఇలా ఏ ఒక్కటో, రెండో రుచులకు మాత్రమే అలవాటు పడి, మిగతా రుచులను స్వీకరించకపోవడం వల్లనే శరీరంలో దోషాలు ధాతువులు అసమానమై సమతౌల్యం దెబ్బతిని సకల రోగాలకు మూలకారణం అవుతున్నయ్.

కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం :

1. కారము, చేదు, వగరు ఈ మూడు రుచులు గల పదార్ధాలను అతిగా సేవించడం
2. బాగా ఎక్కువ గానీ, తక్కువ గానీ భుజించడం
3. అతి వేడిగా గానీ అతి చల్లగా గానీ భోజనం చేయడం
4. ఎక్కువగా గాలికి తిరగటం, లేక నిరంతరం గాలిని విసిరే ఫ్యాన్ల కింద కూర్చోవటం, నిద్రించడం
5. వరుసగా అనేక మాసాల పాటు రాత్రిళ్ళు మేల్కోవటం
6. అనేక మాసాలపాటు విశ్రాంతి లేకుండా విపరీతమైన శారిరక శ్రమ చేయడం
7. మంచు లోను, చల్లటి నీటిలోను, చల్లని గాలిలోను, ఏ.సి. గదులలో ఎక్కువ సమయం గడపడం
8. ఆర్ధక ఇబ్బందుల వల్ల లేక పనుల వత్తిడి వల్ల వేళకు భోజనం చేయకపోవడం, వేళ కాని వేళల్లో అకాల భోజనం చేయడం
9. మలము, మూత్రము, తుమ్ములు, ఆవలింతలు మొదలైన సహజవేగాలను, పనుల ఒత్తిడిలో పడి కొంత సమయం ఆపడం
10. అలివి కాని పనులు చేయటానికి ప్రయత్నించి, విఫలమై అమితంగా దిగులు పడటం, అతిగా అలోచించడం, అతిగా భయపడటం
11. వివిధ అనారోగ్య సమస్యల వల్ల శరీరంలో మాంసం క్షీణించటం
12. జీర్ణ శక్తి గమనించకుండా కఠినమైన పదార్ధాలను సేవించడం, అవి జీర్ణంగాక మురిగిపోయి ఆమం ఏర్పడి వాయు సంచారానికి అడ్డుపడటం

ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన మానసిక శారీరక చర్యల వల్ల 80 రకాల వాత వ్యాధులు పుట్టుకొస్తయ్.

వాతరోగ లక్షణాలు కొన్ని గంటల్లో తెలుసుకుందాం...

Thursday, 23 October 2014

చిట్టి చిట్కాలు..

* సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

* నేరేడు చెక్క కషాయం రెండుపూటలా పుక్కిలిస్తుంటే నోట్లో అతిగా నీరూరటం తగ్గుతుంది.

* గోరింటాకు కషాయంతో కడుగుతుంటే పుండ్లు మాడిపోతయ్.

* నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనొప్పి, వాపు తగ్గుతయ్.

* పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.

* ఆముదపు ఆకులు చితక్కొటి వెచ్చ జేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.

* నువ్వులను పాలతో నూరి రాస్తుంటే జీడిగించల వాపు, మంట తగ్గుతయ్.

* మంచి గంధం చెక్కను నీటితో సాది పట్టు వేస్తుంటే బొడ్డుపుండు తగ్గుతుంది.

* మిరియాల పొడి 3 గ్రాములు కప్పు వేడినీటితో తాగుతుంటే నిద్రలో మాట్లాడటం తగ్గుతుంది.

* పచ్చి ఉల్లి గడ్డలను అన్నంలో తింటూంటే అతినిద్ర, అతిగా ఆవులించటం తగ్గిపోతుంది.

Thursday, 25 September 2014

ఏ ఆహారం తిన్నా, ఆయుష్షున్నంతకాలం బ్రతుకుతాం ! అని భ్రమ పడుతున్నారా? ఆ భావం నిజం కాదు.

ఆహార నియమాల గురించి అసలు తెలియని వాళ్ళు, లేదా తెలుసుకుందామనే అభిరుచి ఉన్నవాళ్ళు మంచిని స్వీకరించటానికి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి ఎప్పుడూ ముందే వుంటారు. కానీ, కొంతమంది వివిధ రుచులకు అలవాటుపడి ఆ జిహ్వ చాపల్యాన్ని అణచుకోలేక, శరీరమంతా రోగగ్రస్తం అయినా కూడా, తిండి మీద వ్యామోహాన్ని చంపుకోలేక నిర్లక్ష్యంగా, తిరస్కారంగా " ఆ...! దేవుడు ఎంతకాలం ఆయుష్షు ఇస్తే అంతకాలం బ్రతుకుతాం. ఆహారం మార్చినంత మాత్రాన ఎక్కువకాలం బ్రతుకుతామా...." అని మెట్ట వేదాంతం వల్లిస్తుంటారు. ఆహార రహస్యాన్ని మరణ రహస్యాన్ని తెలుసుకుంటే ఎవరు ఇంత అలక్ష్యంగా మాట్లాడరు.

మృత్యువు రెండు రకాలు. కాల మృత్యువు, అకాల మృత్యువు. కాల మృత్యువు అనేది భగవంతుడిచ్చిన ఆయువు తీరేవరకు ఉదయిచిన సూర్యుడు క్రమగతిలో అస్తమించినట్లుగా బాల్య యౌవన వార్ధక్య దశల్లో క్రమంగా ఆవరిస్తూ అంతరింపచేస్తుంది. అకాల మృత్యువు అనేది మనిషి ఆహార నియమాలు పాటించకుండ రోగాల పాలైనప్పుడు, రోడ్ల మీద ప్రయాణ నియమాలు పాటించకుండ అతివేగంగా వాహనాలమీద వీరగమనం చేస్తున్నప్పుడు, తన శక్తిని మరచి బలవంతులైన ఇతరులతో వైరానికి, కొట్లాటలకు దిగినప్పుడు, ధర్మము తప్పి ఇతరులను వంచించి అనుక్షణం ప్రాణభయంతో అల్లాడుతున్నప్పుడు, అకస్మాత్తుగా ఆవరించేదే అకాల మృత్యువు. దీనికి ఉదాహరణగా ఏదైనా వాహనాన్ని గురించి చెప్పుకోవచ్చు.

మనం కొత్తగా కొనుక్కున్న వాహనాన్ని రోజూ శుభ్రంగా కడిగి తుడిచి సకాలంలో ఆయిల్ పొసి ఒక క్రమ పద్ధతిలో వాడుకొంటూ ఉంటే దానిని తయారు చేసిన శాస్త్రవేత్త ఆ వాహనానికి ఎంతకాలం లైఫ్ ఉంటుందని చెప్పాడో అంతకాలం ఆ వాహనం దివంగా పనిచేస్తుంది. అలా కాకుండా కొన్నప్పటినుంచీ ఆ వాహనం మీద శ్రద్ధ చూపకుండా, గతుకుల్లో గుంటల్లో ఎత్తెత్తి పడేస్తూ అశ్రద్ధగా నడిపితే ఆ వాహనం అతి తొందరలోనే శిధిలమైపోతుంది.

అదేవిధంగా మానవ జీవితం కూడా ప్రకృతిని, ఋతువులను అనుసరించి ఆహార నియమాలను పాటిస్తూ ప్రాణ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉంటే నిండు నూరేళ్ళపాటు హాయిగా సాగిపోతుంది. అలాకాకుండా విరుద్ధమైన ఆహార సేవనంతో విపరీతమైన దురలవాట్లతో, అహంకారంతో అహంభావం తో జీవించడం అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తిజీవనం అకాల మృత్యువుకు ఆహుతి అవుతుంది. మనిషి ఆయు: పరిమాణానికి ఖచ్చితమైన లెక్కలే వుంటే ఆయువును కాపాడటానికి మందులు, పూజలు, యాగాలు, చట్టాలు, కోర్టుల అవసరమే వుండదు. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసైనా అకాల మృత్యువును తప్పించుకొని, సకాల మృత్యువు కలిగేవరకూ ఆరోగ్యం కాపాడుకోవటమే మనిషి ధర్మం, అదే జీవన మర్మం.

Tuesday, 23 September 2014

లావాటి వారిని సన్నగా - సన్నటి వారిని లావుగా చేసే ఆవుపాలు

దేశవాళి ఆవుపాలు తాగగలిగినన్ని తృప్తిగా రోజూ రెండు లేదా మూడు సార్లు తాగుతుంటే ఏనుగులాగా అతి లావుగా తయారైనవారు క్రమ క్రమంగా చర్మం వ్రేలాడబడకుండా గట్టిపడుతూ సన్నగా నాజూకుగా తయారౌతారు.
అలాగే ఇదేవిధంగా ఆవుపాలు తాగుతునంటే సన్నగా బక్కపలుచగా కృశించివున్నవారు క్రమ క్రమంగా సర్వాంగ సుందరాంగులుగా తీర్చిదిద్దబడతారు.

దురదృష్టం ఏమిటంటే దేశవాళీ గోజాతి అంతరించిపోతుంది. వాటిని చంపి విందుల్లో వినియోగించుకుంటున్నారు.
దేశవాళీ ఆవు పాలు దొరికిన వారు, ఆవు పాలు వేడి అని కొందరు, పలుచగా వుంటాయని కొందరు దురదృష్టవంతులు ఆవుపాలను దూరం చేసుకుని అనారోగ్యానికి దగ్గరౌతున్నారు.

దేశవాళి ఆవుపాలు దొరికిన వారు అదృష్టవంతులు. దయచేసి నిస్సంకోచంగా ఆవుపాలు దొరకటం అదృష్టంగా భావించి తీసుకోండి.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ ; భారతదేశంలో జన్మించడం నా అదృష్టం. 

పెళ్ళిలో మూడే ముళ్లు ఎందుకు వేయాలి ?

ప్రాచీనులు 'మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.
సృష్టి, స్థితి, లయలు మూడు.
ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికశాంతులు మూడు.
యాగానికి కావలసిన అగ్నులు మూడు.
ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.
యజ్ఞోపవీతంలోని పోగులు మూడు.
ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు.
బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.
ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.
అలాగే మంగలసూత్రపు  పేటలు మూడు, ముడులు కూడా మూడు.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:

ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి : స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు.

మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే.( ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా)

శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం. జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా? లేదా? అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే.


పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం  పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం .

ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.
భర్త మరణించిన పిమ్మట కూడా భార్య, ఆమె భర్త పేరుని చెప్పమంటే పోయిన వాని పేరే చెప్తుంది. ఎందువల్ల? భర్త స్థూల శరీరమే పోయింది. మంగల సూత్రాన్ని ఆయన ఆ మిగిలిన రెండు శరీరాలకీ కూడా ముడి వేసాడు కాబట్టి.

అలాగే భార్యా భర్తలు మూడు ముళ్ళ సారాంశం తెలుసుకుని, చిన్ని చిన్ని కలహాలు, అర్థంలేని అపోహలతో వివాహ జీవితాన్ని ఆదిలోనే తుంచుకోకుండా, తమది జన్మ జన్మల బంధం అని తెలుసుకుంటే ఈ అపోహలు, కలహాలు వారిని మరింత దగ్గరచేసే వాహకాలని తెలుసుకుని  వారి బంధం  ఇంకా బలంగా చేసుకోగలుగుతారు.

ఇప్పుడు చేసే సత్కార్యాల ద్వారా తరువాత జన్మల్లో ఉత్తమంగా ఉండగలుగుతారు. ఇలా ఒకరికొరు సహాయపడి జన్మను సార్ధకం చేసుకోవాలని వివాహ బంధం తెలియచేస్తుంది.

పెళ్ళి అంటే ఏదో అవసరానికో, సమాజం కోసమో, లేదా చేసుకోవాలి కాబట్టే చేసుకోవటమో అనుకుని చేసుకుంటే వారి జీవితం వ్యర్ధం. పెళ్ళి పరమార్ధం తెలుసుకుంటే జీవితకాలం ఒకరు లేకపోయినా మరొకరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మిగతా రెండు శరీరాలతో బంధం అలాగే ఉంటుంది కాబట్టి.











Sunday, 21 September 2014

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో అర్ధం ఏమిటి?

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతో అంతరార్ధం వుంది. బాహ్యసమాజంలో ఎదురయ్యే దుష్టులకు దూరంగా ఉన్నంత మాత్రాన మనం బాగుపడలేమని, మన మనసులో ఉన్న కామ, క్రోధ , లోభ, మోహ , మద,మత్సర్యాలనే అసలైన దుష్టులకు దూరంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖశాంతులతో జీవించగలుగుతామని జాగరూకులమై ఉండాలి. 

మానసిక విషాలే మానవరోగాలకు మూలకారణం

మానసిక విషాలే మానవరోగాలకు మూలకారణం. అంటే, రోగమున్న ప్రతిమనిషి మనసులో ఏదో ఒక విషం విరజిమ్ముతుంది అని మనం తెలుసుకోవాలి. మందులతో రోగాలు తగ్గుతాయి అనే భ్రమ నుండి బయటపడి, మనసులో విషాలు లేకుండా చేసుకోవడమే అసలైన ఔషధమని ప్రతిక్షణము గుర్తుచేసుకుంటూ మానవతా మార్గంలో ప్రయాణం చేయాలి.

Saturday, 10 May 2014

ఎండు ఉసిరికాయతో ఆందం, ఆరోగ్యం..

ఎండు ఉసిరికాయ బెరడు ముక్కల్ని తెచ్చుకుని నిలువచేసుకుని రోజూ పది ముక్కలు మంచినీళ్ళు తాగే కుండలో వేసి, ఆ ముక్కలు నానిన తరువాత ఆ నీళ్ళు తాగుతూ వుండాలి. ఈ అలవాటు సంవత్సరం పొడవునా చేస్తూ వుంటే మీ అందం మీ ఆరోగ్యం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.

Saturday, 19 April 2014

లవణము(ఉప్పు లాభ నష్టాలు):

* ఉప్పును ఆహార పదార్ధాలలో కలిపి వాడటం వల్ల అది శరీరంలోని విషపు నీరును దగ్ధము చేసి మాలిన్యాలను తీసివేస్తుంది. ఆకలిని వృద్ధిచేసి మల పదార్ధాలను సక్రమంగా విసర్జింపచేస్తుంది.
* పేరుకుపోయిన కఫము, విషపదార్ధాలు, గట్టిగా వుండలు కట్టిన మలము,జీర్ణము కాని అన్య పదార్ధాలు వీటన్నిటిని తన శక్తితో ముక్కలు ముక్కలు చేసి బయటకు నెట్టివేస్తుంది. అన్నాశయం అపక్వ పదార్ధాలతో నిండివున్నప్పుడు ఆ పదార్ధాలను బలవంతంగా తోసివేసి ఖాళీ ఏర్పరుస్తుంది. కడుపులోని వాత వాయువును హరింపచేస్తుంది.
* శరీరమునందలి కీళ్ళపట్లు, తాడుతో బంధించినట్లుగా కలిగే కాళ్ళు చేతుల నొప్పులు నిమ్మళింపచేస్తుంది.
* శరీరంలోని తక్కిన రసాలను అణగదొక్కి తనదే పై చేయిగా చేస్తుకుంటుంది.
* ఉప్పు గురు గుణాన్ని, వేడి చేసే స్వభావాన్ని, చమురు తత్వాన్ని మితంగా కలిగివుంటుంది.

ఇన్ని మం చి గుణాలు ఉన్నప్పటికి కేవలం ఉప్పునే ఎక్కువగా ఉపయోగిస్తే అది అనేక వ్యాధులను కలుగచేస్తుంది.. అవి ఎంటొ తరువాత తెలుసుకుందాం...

Sunday, 23 March 2014

ఏన్నో క్రూర రోగాలకు - తిప్పతీగ :

రోజూ ఉదయం లేక సాయంత్రం ఆహారానికి అరగంట ముందు ఒక్క తిప్పతీగ ఆకును శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా నమిలితింటూ వుంటే 15 నుండీ 30 రోజుల్లో అధిక రక్తపోటు , కొలెస్త్రాల్, మధుమేహం, దగ్గు, ఉబ్బసం, పాతజ్వరాలు, చర్మం పై గుల్లలు, పుండ్లు, గాయాలు, అతికొవ్వు, మూత్రావయవాల్లో రాళ్ళు , మూత్రనాళంలో పుండు, లివర్ పెరుగుదల, ప్లీహాభివృద్ధి, సకల వాతనొప్పులు మొదలైన అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులోకివస్తయ్.

Wednesday, 19 March 2014

తులసి వున్న ఇంట్లోకి ఏ రోగమైనా ప్రవేశించగలదా?

" తులసి మొక్కల గాలి తగిలన చాలు 
అంటు వ్యాధుల క్రిములన్ని అణగిపోవు, 
సర్వవ్యాధి నివారణ శక్తి యున్న 
తులసి ఇంటింట శుభములు కలుగజేయు ."

తులసి మొక్క మానవజాతి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన అమూల్యమైన వరం. దీని గొప్పతనాన్ని చెప్పాలంటే గంటలు,రోజులు, నెలలు కూడా చాలవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులందరికి వచ్చే అన్ని రకాల జబ్బుల్ని అంటే కడుపునొప్పి నుంచీ క్యాణ్సర్ వరకు ఏ జబ్బులైనా అవలీలగా తగ్గించగల అద్భుతమైన ఔషధీ రాజం ఈ తులసి.

శ్రీకృష్ణుడు ఎల్లవేళల విహరించే బృఉందావనం - మరేదో కాదు తులసివనమే. ఆయన ఎల్లప్పుడూ తులసి మాలను ధరించి, తులసి తీర్ధం తాగుతూ, తులసీ వనంలో విహరించడంవల్ల అంతటి శక్తివంతుడు కాగలిగాడు.
తులసీ జలంధరుల కధ మీరు వినే ఉంటారు. ఆనాడు సమస్త లోకల్ని గడగడలాడించి తన ఔన్నత్యాన్ని నిరూపించుకున్న ఆ తులసీ మహా పతివతే, భూలోకంలో ఈ తులసిగా అవతరించి మనుషుల ఆరోగ్యాన్ని అంటు వ్యాధుల్ని తరిమి కొట్టీ, పాపాల నుంచి శాపాల నుంచి విముక్తుల్ని చేసి మనకు శానిని, సుఖాన్ని కలిగిస్తుంది అని మన పురాణాలు తెలుపుతున్నాయి.

అంతే కాదు ఈనాడు ప్రపంచంలోని అనేకమంది ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కూడా ఈ తులసి సర్వ వ్యాధుల్ని నివారించగల తిరుగులేని ఔషధం అని ఏకగ్రీవంగా తీర్మానించారు.
(ఇంకా వుంది )

Thursday, 13 March 2014

పిత్తాశయం ఏమి చేస్తుంది :

పిత్తాశయం మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం.అది శరీరంలో ఉష్ణం ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా సమస్థితిలో ఉండేటట్లు చేస్తూ కాలేయానికి హానికలుగకుండా కాపాడుతుంటుంది. అంతటి ప్రధానమైన పిత్తాశయాన్ని చిన్న రాయి పుట్టిందనే కారణంతో తీసివేయాలనుకోవటం సరికాదు. ఒకవేళ పొరపాటుగానో గ్రహపాటుగానో దాన్ని తీసివేస్తే ఆతరువాత శరీరంలో ఉష్ణం అతిగా ప్రకోపించి కాలేయం బాగుచేయడానికి వీలులేని విధంగా దెబ్బతింటుంది. 

Saturday, 8 March 2014

అన్ని రోగాలకు - అసలు కారణం :

ఈనాడు దాదాపు వైద్యులంతా  రోగాలకు మూలమైన కారణాలకు చికిత్స చేయకుండ కేవలం రోగానికి మాత్రమే చికిత్స చేస్తున్నారు. అందుకే రోగాలు మళ్ళీ మళ్ళీ పుడుతూ దీర్ఘకాలిక వ్యాధులుగా రూపాంతరం చెందుతూ ప్రాణాలు తీస్తున్నయ్. ఆయుర్వేదం రోగాలకు గల కారణాలకు చికిత్స చేసి, రోగాలను సమూలంగా నిర్మూలించి నూరేళ్ళ ఆయుష్షును ప్రసాదిస్తుంది.

ఈనాడు మనల్ని బాధిస్తున్న వ్యాధులన్నీ మనంతినే రసాయనిక విష కలుషితమైన ఆహారం వల్ల,కాలుష్యమైన నీటి వల్ల, గాలి వల్లనే వస్తున్నయ్. ధనానికి దాసుడైన మానవుడు లాభాపేక్షతో రసాయనిక ఎరువుల్ని గుప్పిస్తూ, ఆహార పదార్ధాలను పండిస్తున్నాడు. ఆ ఆహారం ద్వారా మానవ శరీరాల్లోని అణువణువులో విషరసాయనాలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నయ్. వాటి ప్రభావంతో శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి, చిన్న వయసులోనే రోగాలకు గురౌతుంది.

ఈ రోగాలు ఎన్ని ఔషధాలు వాడినా తగ్గవు. ఎందుకంటే శరీరంలో వున్న రసాయనాలు నానాటికీ పెరుగుతూ వుంటయ్. ఈ రసాయనాలను శరీరంనుండి బహిష్కరింప చేయకుండ, తామర తంపరులుగా ఔషధాలు వాడుతూ పోతే ప్రయోజనం శూన్యం. రోగాలు ఇంకా పెరగటం తప్ప తగ్గే అవకాశమే వుండదు.

ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి పూర్వకాలం వాడిన సాంప్రదాయక ఎరువుల్ని, మొక్కల్ని, వేప, కానుగ చెట్ల ఆకుల్ని ఉపయోగించటం మొదలుపెట్టాలి. లేకపోతే ఈ విష రసాయనాల ప్రభావం వల్ల ఈ తరం వాల్లే కాక, భావితరాలు కూడా వ్యాధిగ్రస్తులు కాకతప్పదు.

మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .