Tuesday, 23 September 2014

పెళ్ళిలో మూడే ముళ్లు ఎందుకు వేయాలి ?

ప్రాచీనులు 'మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.
సృష్టి, స్థితి, లయలు మూడు.
ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికశాంతులు మూడు.
యాగానికి కావలసిన అగ్నులు మూడు.
ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.
యజ్ఞోపవీతంలోని పోగులు మూడు.
ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు.
బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.
ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.
అలాగే మంగలసూత్రపు  పేటలు మూడు, ముడులు కూడా మూడు.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:

ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి : స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు.

మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే.( ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా)

శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం. జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా? లేదా? అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే.


పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం  పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం .

ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.
భర్త మరణించిన పిమ్మట కూడా భార్య, ఆమె భర్త పేరుని చెప్పమంటే పోయిన వాని పేరే చెప్తుంది. ఎందువల్ల? భర్త స్థూల శరీరమే పోయింది. మంగల సూత్రాన్ని ఆయన ఆ మిగిలిన రెండు శరీరాలకీ కూడా ముడి వేసాడు కాబట్టి.

అలాగే భార్యా భర్తలు మూడు ముళ్ళ సారాంశం తెలుసుకుని, చిన్ని చిన్ని కలహాలు, అర్థంలేని అపోహలతో వివాహ జీవితాన్ని ఆదిలోనే తుంచుకోకుండా, తమది జన్మ జన్మల బంధం అని తెలుసుకుంటే ఈ అపోహలు, కలహాలు వారిని మరింత దగ్గరచేసే వాహకాలని తెలుసుకుని  వారి బంధం  ఇంకా బలంగా చేసుకోగలుగుతారు.

ఇప్పుడు చేసే సత్కార్యాల ద్వారా తరువాత జన్మల్లో ఉత్తమంగా ఉండగలుగుతారు. ఇలా ఒకరికొరు సహాయపడి జన్మను సార్ధకం చేసుకోవాలని వివాహ బంధం తెలియచేస్తుంది.

పెళ్ళి అంటే ఏదో అవసరానికో, సమాజం కోసమో, లేదా చేసుకోవాలి కాబట్టే చేసుకోవటమో అనుకుని చేసుకుంటే వారి జీవితం వ్యర్ధం. పెళ్ళి పరమార్ధం తెలుసుకుంటే జీవితకాలం ఒకరు లేకపోయినా మరొకరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మిగతా రెండు శరీరాలతో బంధం అలాగే ఉంటుంది కాబట్టి.











0 comments:

Post a Comment